Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 60

Story of Trisanku - 3 !!

|| om tat sat ||

తపోబలహతాన్ కృత్వా వాసిష్టాన్ స మహోదయాన్ |
ఋషిమధ్యే మహాతేజా విశ్వామిత్రోsభ్యభాషత ||

’"మహోదయునితో సహా వసిష్ఠపుత్రులను తపోబలముతో హతము చేసిన తరువాత ఆ ఋషులమధ్యలో విశ్వామిత్రుడు ఇట్లు చెప్పెను"

బాలకాండ
అరువది సర్గము

శతానందుడు విశ్వామిత్రుని కథ కొనసాగించెను.

’' ఓ రామా ! మహోదయునితో సహా వసిష్ఠపుత్రులను తపోబలముతో హతము చేసిన తరువాత ఆ ఋషులమధ్యలో విశ్వామిత్రుడు ఇట్లు చెప్పెను. "ఇతడు ఇక్ష్వాకు కులము వాడు. ధర్మముపాటించువాడు. దానములను చేయువాడు. త్రిశంకుడను పేరు గలవాడు. నా శరణు కోరి వచ్చినవాడు. ఈ శరీరముతో దేవలోకమునకు పోవు కోరికగలవాడు. నాతోకూడి మీరు అందరూ ఇతడు తన శరీరముతో స్వర్గము పోవు విధముగా యజ్ఞము చేయుదురు గాక".

’'విశ్వామిత్రుని వచనములను విని ధర్మజ్ఞులు ఇట్లు అనుకొనిరి. "కుశిక వంశజుడైన ఈ ముని పరమ కోపిష్టి. ఆయన అగ్ని తో సమానమైన వాడు. కోపమువచ్చిన చో సంశయములేకుండా శాపము ఇచ్చును. ఈ కార్యము ఆయన వచనముల ప్రకారము చేయుట మంచిది. అందుకని విశ్వామిత్రుని యొక్క తేజస్సుతో ఈ ఇక్ష్వాకు వంశజుడు శరీరముతో దేవలోకము వెళ్ళునట్లు యజ్ఞము చేయుదము. అందరూ సిద్ధము కండు".

’’'మహర్షులు ఈ విధముగా చెప్పి తమతమ పనులు చేయసాగిరి. విశ్వామిత్రుడు క్రతువు యొక్క యాజకుడు అయ్యెను. ఆఋత్విజులు మంత్ర కోవిదులు. మంత్రములతో అన్ని కర్మలను యథావిథిగా కల్పములను అనుసరించి చేసిరి. అప్పుడు చాలాకాలము తరువాత మహాతపోవంతుడైన విశ్వామిత్రుడు దేవతలందరినీ వారి హవిర్భాగము తీసుకొనుటకు ఆవాహనమిచ్చెను. దేవతలందరూ వారి హవిర్భాగములు తీసుకొనుటకు రాలేదు. అప్పుడు మహాముని యగు విశ్వామిత్రుడు కోపముతో తన స్రువమును పైకెత్తి త్రిశంకుని తో దేవతలమీద మిక్కిలి కోపముతో ఇట్లనెను.’'

"ఓ రాజా! నేను ఆర్జించిన తప శ్శక్తిని చూడుము. నిన్ను ఈ శక్తితో సరీరముతో సహా స్వర్గము పంపించెదను. ఓ నరాధిప దుష్కరమైన స్వర్గమునకు శరీరముతో వెళ్ళుము. ఓ రాజా ! నేను సంపాదించిన తపోఫలము కొంచెము ఉన్ననూ నీ శరీరముతో దేవలోకమును పోందెదవు".

’'అట్లు విశ్వామిత్రుడు చెప్పిన వెంటనే ఆ త్రిశంకుడు మునులు చూచుచుండగనే దేవలోకమునకు పోయెను. దేవలోకములో త్రిశంకుని చూచి ఆ దేవతలందరి తో కూడిన ఆ ఇంద్రుడు ఇట్లు పలికెను. "ఓ త్రిశంకు ! నీవు మరల వెనక్కి పొమ్ము. ఓ మూఢా! గురుశాపము పొందిన నీవు స్వర్గము పొందుటకు అనర్హుడవు". మహేంద్రునిచే ఇట్లు చెప్పబడి త్రిశంకువు మరల భూమిపై పడిపోవుచూ "రక్షింపుము" "రక్షింపుము" అనుచూ తపోధనుడైన విశ్వామిత్రుని వేడుకోనెను’'.

’'అలా ఆక్రోశములో నున్న అతని మాటలను విని కౌశికుడు దేవతలపై మిక్కిలి క్రోధముతో త్రిశంకునుని " ఆగుము ఆగుము" అని పలికెను. అప్పుడు విశ్వామిత్రుడు ఇంకొక ప్రజాపతి వలె తన దగ్గర వున్న ఋషుల ముందర దక్షిణ మార్గములో ఇంకొక సప్త ఋషులను సృష్ఠించెను. ఆ మహాయశస్సుగల విశ్వామిత్రుడు క్రోధముతో మునుల సమక్షములో దక్షిన దిశలో మరియొక నక్షత్ర మండలమును సృష్ఠించెను. క్రోధములో మునిగిపోయిన విశ్వామిత్రుడు మరొక నక్షత్ర మండలము సృష్టించిన పిమ్మట "ఇంకొక ఇంద్రుని సృష్టించెదను లేక (స్వర్గమును) ఇంద్రరహితముగా చేసెదను"’ అని తలచి, ఆ క్రోధములో దేవులను కూడా సృష్టించుటకు పూనుకొనెను. అప్పుడు సురాసురులు ఋషి సంఘములతో కూడి మహాత్ముడైన విశ్వామిత్రునితో అనునయ వాక్యములతో ఇట్లనిరి’'.

"ఓ మహాభాగా ! అ రాజు గురుశాపము పొందెను. ఓ తపోధనా ! సరీరముతో దేవలోకమునకు వచ్చుటకు అనర్హుడు."

’'ఆ దేవతల వచనములను విని ఆ మునిపుంగవుడుగు కౌశికుడు ఒక ముఖ్య విషయము ప్రస్తావించెను. "మీకు శుభమగుగాక . ఈ భూపతి యగు త్రిశంకుని శరీరముతో దేవలోకము పంపుటకు ప్రతిజ్ఞపూనిన నేను నా మాటను అసత్యముచేయుటకు ఇష్టములేదు.
శరీరముతో కూడిన త్రిశంకు స్వర్గము ఇప్పుడు శాశ్వతము అగును. నాచే సృజింపబడిన నక్షత్ర మండలములు కూడా ధృవముగా నుండును. జగత్తులోని లోకములన్నీ ఉన్నంతకాలము నాచే చేయబడిన లోకములన్నియూ కూడా నిలిచియుండును. దేవతలందరూ దానికి అనుమతి ఇచ్చుదురు గాక".

ఇట్లు చెప్పబడిన దేవతలు అందరూ ఆ మునిపుంగవుని తో ఇట్లనిరి. " నీకు శుభము అగు గాక. అట్లే అగును. సృజించినవి అట్లే నుండును. ఓ ముని శ్రేష్ఠ ! గగనములో అనేక నక్షత్రములు ఉండును. వానిలో నీచే సృజింపబడిన నక్షత్ర మండలములు జ్యోతిష్చక్రమునకు బయట ప్రకాశించు చుండును. త్రిశంకుడు అమరుడై అపచారఫలితముగా అధోముఖుడై ఉండును. నీచే సృజింపబడిన నక్షత్రములన్నియూ కృతర్థుడు కీర్తిమంతుడు అయిన త్రిశంకుని అనుసరించును". ఇట్లని విశ్వామిత్రుని దేవతలు శాంతము చేసితిరి.

’' అప్పుడు అందరు దేవతలచేత విశ్వామిత్రుడు ప్రస్తుతింపబడెను. మహాతేజోవంతుడు కూడా దేవతలతో " శుభము" అని పలికెను. ఓ రామా ! అప్పుడు యజ్ఞము సమాప్తము అవగా దేవతలు మహాత్ములు తపోధనులు మునులు అందరూ వచ్చిన విథముగనే వెళ్ళిపోయిరి’'.

|| ఈ విథముగా శ్రీమద్రామాయణములో ని బాలకాండలో అరువదియవ సర్గము సమాప్తము||

|| ఓమ్ తత్ సత్ ||

తతో దేవా మహాత్మానో మునయశ్చ తపోధనాః |
జగ్ముర్యథాగతం సర్వే యజ్ఞస్యాంతే నరోత్తమ ||
తా|| "ఓ రామా ! అప్పుడు యజ్ఞము సమాప్తము అవగా దేవతలు మహాత్ములు తపోధనులు మునులు అందరూ వచ్చిన విథముగనే వెళ్ళిపోయిరి".

|| ఓమ్ తత్ సత్ ||